17/08/2013

|| లేవు ||

బైట సూర్యోదయంతో బాటు
ఇంట్లో చంద్రోదయాలు లేవు 

తొలకరిజల్లులా కురుల చివరల
నీటి తుంపర్ల అభిషేకాలు లేవు
కనురెప్పలపై తీయని స్పర్శలు లేవు
కాఫీకప్పుపై గాజుల (ద్రవ)తరంగిణులు లేవు

పూజగది నుండి అగరుపొగలు లేవు
హారతికర్పూరపు సుగంధాలు లేవు
వంటగదిలో కమ్మటి వాసనలు లేవు
తాలింపుల ఘుమఘుమలు లేవు

ఆఫీసుకెళ్ళేముందు తాయిలాలు లేవు
ఇంటికొస్తే ఎదురుచూపులు లేవు
మువ్వల సవ్వడులు లేవు
అందెలరవళులు లేవు.
జాజుల జావళీలు లేవు
మల్లెమాలల పరిమళాలు లేవు.

ఆషాఢమాసం వెళ్ళినా
నీవొచ్చే దాఖలాలు లేవు.
శ్రావణమొచ్చినా
నావిరహం తీరే దారులు లేవు. ...శ్రీ 

4 comments:

 1. ఆషాఢమాసం వెళ్ళినా
  నీవొచ్చే దాఖలాలు లేవు.
  శ్రావణమొచ్చినా
  నావిరహం తీరే దారులు లేవు. ...శ్రీ

  అంటూ కూచుంటే ఎలాగండీ టిక్కట్లు లేవని, ఇక్కట్లు పడక బయలుదేరి, రైలు పట్టాల వెంట నడిచయినా చెలిని చేరుకోడమే మార్గం :)


  ReplyDelete
 2. అవును అంతే అంతే ..మీరన్నదే కరక్ట్...ధన్యవాదాలు శర్మగారు ..@శ్రీ :-)

  ReplyDelete
 3. ఆషాఢమాసం వెళ్ళినా
  నీవొచ్చే దాఖలాలు లేవు.
  శ్రావణమొచ్చినా
  నావిరహం తీరే దారులు లేవు.....చాలాబాగా చెప్పారు శ్రీ జీ....కానీ తనవారు వస్తారని ఎదురు చూడటం లో కూడా గమ్మత్తైన తియ్యదనం ఉంది :)

  ReplyDelete
 4. ఏంటండి శ్రీగారు ఇదంతా విరహవేదనేనా? :-)

  ReplyDelete