12/09/2013

|| సైకత రేణువులు ||






ఎన్ని రోహిణీకార్తెలలో 
చండ్రనిప్పుల్లా కాలిపోయాయో 
ఎన్ని తొలకరి జల్లులలో
తడిసి మురిసిపోయాయో 
ఎన్ని శిశిరాలలో 
గజగజ వణికిపోయాయో
ఎన్ని పున్నమితరగలలో
అప్రమేయంగా కలిసిపోయాయో 
ఎన్ని అమాసల చీకటి కెరటాలకు 
తోడుగా ఉన్నాయో 

ఎన్ని అందమైన పాదాలకు
చక్కిలిగిలిగింతలు పెట్టాయో 
ఎన్ని మువ్వల సవ్వడులకు
తాళమేస్తూస్తూ తలలూచాయో
ఎన్ని వేళ్ళు వ్రాసుకున్న ప్రేమాక్షరాలలో
మునిగి పరవశించాయో

ఎన్ని సాయంత్రాలు... 
ప్రేయసీ ప్రియుల నిరీక్షణాక్షణాలను లెక్కించాయో
ఎన్ని జతల సప్తపదులను ప్రత్యక్షంగా తిలకించాయో
ఎన్ని అనురాగ సంగమాలకు పులకించాయో
ఎన్ని అందాల కింద నలిగి సిగ్గిల్లాయో

ఎన్ని ఆకృత్యాలకు రోదించాయో
ఎన్ని చీకటి క్రీడలకి వేదికలయ్యాయో
ఎన్ని అశ్రుబిందువులతో తలంటుకున్నాయో 
ఎన్ని రుధిరకణాలలో తడిసి ముద్దయ్యాయో 

ఎన్ని సంఘటనలు చూసినా,
ఎన్ని క్రియలకి మూగసాక్షులైనా...
స్వచ్చంగా తమ తళుకులతో నవ్వుతూ 
ప్రతి ఉషస్సునీ స్వాగతిస్తూనే ఉంటాయి.
ప్రతి రేయినీ సాదరంగా సాగనంపుతూనే ఉంటాయి. ...@శ్రీ 

4 comments:

  1. వావ్!!
    చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. థాంక్ యు హర్షా ...నీ ప్రశంసకి...:-)@శ్రీ

      Delete
  2. ఎన్ని సంఘటనలు చూసినా,
    ఎన్ని క్రియలకి మూగసాక్షులైనా...
    స్వచ్చంగా తమ తళుకులతో నవ్వుతూ
    ప్రతి ఉషస్సునీ స్వాగతిస్తూనే ఉంటాయి.
    చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మారాణి గారు ...చక్కని మీ ప్రశంసకి....@శ్రీ

      Delete