19/09/2013

|| నిశ్శబ్ద నివేదన ||నీవు వ్రాసేవి లిప్తకి వేయి ప్రేమలేఖలు అంటావు.
నా నిరీక్షణాక్షణాలను క్షణానికి వెయ్యి చొప్పున లెక్కించినా
నీకు కొన్నియుగాలు పడుతుంది లెక్కింపు పూర్తి చేసేందుకు.
ఆక్షణాలలో సగం దాచాలన్నా 
వందల గేలక్సీలు కావాలి.
ఆక్షణాలను కుప్పలుగా పోస్తే
సప్త సముద్రాల తీరాలు చిన్నవిగానే కనిపిస్తాయి...చిన్నబుచ్చుకుంటాయి.


(నీ)కలలనిచ్చే రేయి కోసమే
ఎదురుచూస్తుంటాయి మూతబడని (నా)కన్నులు.
ఎంత చూసినా కల'కావలేనా' ప్రతి రేయి?
నిజమయ్యే స్వప్నాల కోసమే
కలలు కంటున్నాయి 'ఆశలమేనా'ని మోసే నా ఊహలు.
నీవుండే కల కోసం
ఎన్ని నిద్రలేని రాత్రుల మూల్యం చెల్లించాలన్నా సిద్ధమే.
ఎన్ని కాళరాత్రులిచ్చానో నా స్వప్నాలకి
నిన్ను రప్పించేందుకు రుసుముగా.
తీరని ఆరాటమే
తీపికలల తీరం చేరాలని కలతల సుడిలో చిక్కిన కన్నులది.
ప్రతి రేయికీ అలసటే
నా కళ్ళకి...నీ కళలు చూపే కలల లోకాల దారులు చూపుతూ.
నీఅందాలను చూసే కలలు 'కనేందుకు'
నా రెప్పలు పడే నొప్పులు నీకెలా తెలుస్తాయి.

కలలోనైన కానరాని నీకోసం మనసు పడే వేదన నీకెలా చెప్పేది?
గుండె సవ్వడులతోనే మనమధ్యనున్న
నిశ్శబ్దాన్నిభేదించే ప్రయత్నంలో తలమునకలౌతున్నా.
ఆశబ్దం ఎదలోనున్న నీకు నిద్రాభంగమౌతుందని భయమోపక్క వేధిస్తోంది.
అందుకే ....నిశ్శబ్దంగానే నీ ఆరాధన...సవ్వడి లేకుండానే నామది నీకు నివేదన... ...@శ్రీ 

9 comments:

 1. నిశ్శబ్దం కూడా ఇంతందంగా మాట్లాడుతుందా?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భావన గారు... నిశ్శబ్దం మాట్లాడుతుంది మౌనంతో నిశ్శబ్దంగా...:-)....
   @శ్రీ

   Delete
 2. మీరు ప్రేమను ఎలా చెప్పినా బాగుంటుందండి.

  ReplyDelete
  Replies
  1. హహః... పద్మ గారు ధన్యవాదాలు మీ ప్రశంసకి...@శ్రీ

   Delete
 3. శ్రీ గారూ, బాగుంది నిశ్శబ్ద నివేదన, మాట కంటే మవునమే భావాన్ని తెలుపుతుంది.

  ReplyDelete
  Replies
  1. Thank you so much meraj garu. Nijame meeru cheppindi...@sri

   Delete
 4. This comment has been removed by the author.

  ReplyDelete