28/02/2012

వెన్నెల కురిపించవా?




లోకమంతా చంద్రుని చల్లని వెన్నెలలో తడుస్తోంది..
ఎర్రకలువ రేకుల మెత్తదనంతో పోటీ పడే నీ పాదాలు 
వెన్నెల కాంతిలో మెరుస్తుంటే చూడాలని ఉంది.


'నీలో మచ్చ ఉంది'.
'నాలో మచ్చ లేదు' అని చంద్రుని ఎగతాళి చేసే
నీ ముఖ చంద్రబింబాన్ని చూడాలని ఉంది.

ఎగిరే నీ ముంగురులలో  వెన్నెల  ప్రతిఫలింప జేసి...
వింతశోభను నీ ముంగురులకు అందించిన
ఆ చంద్రబింబాన్ని చూడటం కంటే,
నీ మోములోని చంద్రుని  చూడటమే నాకు ఇష్టం  ప్రియా!....

కరుణించవా?
నా చీకటి  జీవితంలో వెన్నెల కురిపించవా?

27/02/2012

ప్రేమలేఖ





మువ్వల సవ్వడి




వెన్నెల 
పుచ్చపూవులా పరుచుకుంది....
నీ రాక కోసం ఎదురు చూసే
నా కన్నులకి అమృత వర్షంలా కనిపిస్తోంది....

నెలరాజు  నీకోసమే  
కాంతిబాటలు పరిచినట్లుంది,
నక్షత్రాల వీధి దీపాలను
నీకోసమే అమర్చినట్లుంది...
ఘల్లు ఘల్లుమని సవ్వడి చేసే
నీ కాలి అందెల మువ్వలు
తళతళలాడుతుంటాయి...
ఈ వెన్నెల్లో 
మిలమిల మెరుస్తుంటాయి.....

ఆ మువ్వల సవ్వడులు 
ప్రతినిత్యం నా ఇంట్లో వినపడనీ....
ఆ మువ్వల మెరుపులు 
అనుక్షణం  నా కంట్లో కనపడనీ....

నల్లని జలపాతం



ఈ లోకానికి తెల్లవారుతుంది సూర్యోదయంతో....
నాకు తెల్లవారుతుంది నీ ముఖ చంద్రోదయంతో....

ప్రత్యూష సమయంలో..
నీ నల్లని జలపాతం లాటి కురులు
చేసే అల్లరికి  నిద్ర లేవటం అలవాటుగా మారి పోయింది ప్రియా.....

అలిసి సొలిసి నిద్రించే నన్ను...
నీ నీలి కురుల జలపాతపు తుంపర్లు తాకి...
నా అలసటను దూరం చేస్తూ నిద్ర లేపుతాయి...

అలా ప్రతి రోజు నిద్ర లేపుతానని బాస చేస్తే
నీతో మళ్లీ అలిసిపోతాను ప్రియా...
నీలో మళ్లీ కలిసిపోతాను ప్రియా...

23/02/2012

నీవు లేని..

  
ఎక్కడున్నావు ప్రియతమా?
నాతోనే జీవితమన్నావు....
నా వెంటే ఉంటానన్నావు...
కనిపించని సుదూర తీరాలకు వెళ్ళిపోయావు....
నీవు లేని నా జీవితం తుఫానులో చిక్కుకున్న నావ....

మరుజన్మలో కూడా నీ తోడు కావాలని వరమడుగుతా.....
నాకోసం వేచి చూడు ప్రియతమా...
దేవుడు వరమిస్తే...
వలపై నీకోసం వచ్చేస్తా,
మబ్బై కమ్మేస్తా,
వానై, వరదై వచ్చి  నా ప్రేమలో  ముంచేస్తా...
తట్టుకోవాలి  సుమా...

హృదయ స్పందన



నీ పేరు మేఘమాలిక మీద వ్రాస్తే 
స్వాతి చినుకై కురిసి, మంచిముత్యమై మెరిసింది...
నీ పేరు గాలిలో వ్రాస్తే 
నా జీవన వేణువుకి శ్వాసయై పలికింది...


నీ పేరు నీలి సాగరం మీద  వ్రాస్తే 
ప్రేమతరంగమై వచ్చి నన్ను చల్లగా తాకింది...
నీ పేరు చంద్రునిమీద వ్రాస్తే
వెన్నెలై నా ఇంటి ముంగిట్లో కురిసింది...


నీ పేరు నీ అరచేతుల్లో  వ్రాస్తే 
నా వీపున ప్రేమ ముద్రలుగా మారాయి...
నీ పేరు నీ పెదవిపై వ్రాస్తే 
నా పెదవిపై నీ సంతకమై వెలిగింది...

నీ పేరు నీ మదిలో వ్రాస్తే 
అది నా హృదయ స్పందనగానే
మారి పోయింది ....




22/02/2012

నీ ప్రేమ



నీ మాటల్లో తీయదనానికి  నీ తీపి  పెదవులే కారణం....
నీ స్పర్శ లోని చల్లదనానికి  నీ అనురాగమే  కారణం....
నీ గుండెల్లో నా గుండెల చప్పుడు విన్పిస్తోందంటే,
అందుకు  నీ ప్రేమే కారణం....

పగలంతా నీ తలపులతో గడిపితే,
రాత్రంతా నీ కలలతో గడిపేస్తున్నా...

అమ్మో! యింత ప్రేమ తట్టుకోలేనంటావా???
ఏమి చెయ్యమంటావు ప్రియా....
నేను నా  ప్రేమను కొలుచుకోవటం  ఎప్పటికీ నేర్చుకోలేనేమో???