11/09/2014

|| కనులుతెరచి చూసాను - తెలుగు గజల్ || (200 వ పోస్ట్ )


             ( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో  )



నీకోసమె ప్రతినిమిషం వేచిచూసి అలిసాను 
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను 

పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను 
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను 

నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను 

చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా    
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను

ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ 

|| తెలుగు గజల్ ...నువ్వు నవ్వావని ||













నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని 
వనమంతా విరులైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని 
కలతంతా  సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని

మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని 
ఎదలోనే  రవమైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని 

#నెలరాజా కనిపిస్తే  తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని   ... @శ్రీ 

|| నువ్వు నేను ||













నా తలపులలో నిలుస్తావు 
నీ జ్ఞాపకాలతో బాధిస్తావు
నిన్ను నేను తలపుగా భావిస్తున్నా,
జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను 



జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా
చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా
వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు
మదిని ప్రేమగా పలకరించేవి నీవైనజ్ఞాపకాలు.




మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా
నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ
నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా
సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ...
మునుముందుకి సాగిపోతున్నా.

నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతో



అడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమే
ఎదసంద్రంలో అలవైతే ధమనుల్లో తేనెల పరుగులే ...
ఎదసవ్వడి నువ్వనే నిశ్శబ్దమై మిగిలున్నా
నా గమ్యం నువ్వనే ఏడడుగులు వేస్తున్నా.




సవ్వడి నేనైతే నీమువ్వల రవళితో జత కలుపు
గమ్యం దూరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు

07/09/2014

|| నమో బాపు ||


నాకలోకానికి కొత్తరంగులద్దుతోంది
అంచెలంచెలుగా ఎదిగిన 'బాపు' కుంచె 

అప్సరలంతా లైను కట్టేసారు 'బాపు' ముందు 
మా బొమ్మలు కూడా అందంగా  వేయమంటూ

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 'బాపు'ని
దేవలోకానికి ఆస్థాన చిత్రకారునిగా 

సంపూర్ణ రామాయణాన్ని మళ్ళీ తీస్తున్నారు 'బాపు'
మేకప్పక్కర్లేని దేవతలే పాత్రధారులుగా.

భూలోకంలో దేవకుమారుల వేట మొదలైంది 
'బాపు' చూపిన చిత్రాల్లోని (బొ)కొమ్మల కోసం

'బాపు'కే  ఇచ్చాడు విశ్వకర్మ...
తాను నిర్మించే భవనాల గోడలపై చిత్రాలు గీసే కాంట్రాక్టు.

బ్రహ్మ కూడా శిష్యుడయ్యాడు 'బాపు'కి
అందరి నుదిటి రాతలు మరింత అందంగా వ్రాద్దామని 

పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు...దేవతలు 
బాపు కార్టూనుల ప్రదర్శనలు చూసి.

సరసన చోటిచ్చారు దేవతలు 'బాపు'కి 
తమని...తమకంటే బాగా చిత్రాల్లో చూపాడని.

ఒక్కదేవుడైనా ఇవ్వలేదు శతాయుష్షు...
అందరికీ తన రేఖాచిత్రాలలో ప్రాణం పోసిన 'బాపు'కి 






   



03/08/2014

|| స్నేహమంటే ఇదే ||






అందరికీ  స్నేహితుల రోజు శుభాకాంక్షలు ...@శ్రీ 
(HAPPY FRIENDSHIP DAY TO ALL MY FRIENDS )

స్నేహమంటే ... సాగారాకాశాలదే...
యోజనాల దూరంలో ఉన్నా
కల్పాలైనా కలుసుకోకున్నా
క్షితిజం దగ్గర కలిసినట్లనిపిస్తూ
దివారాత్రాలనే భేదం లేకుండా
ఒకదానినొకటి చూసుకుంటుంటాయి

ప్రతిఫలాపేక్ష లేకుండా పలకరిస్తుంది గగనం.
పగలు... కొన్ని వెలుగురేకులు చల్లుతూ
రాత్రి ... గుప్పెడు చల్లనికాంతులు చిలకరిస్తూ

సంద్రం ప్రతిబింబిస్తుంది అంబరాన్ని
పగటి కాంతుల మిలలను చూపుతూ
తారల తళుకుల అందం చూసుకొనే అద్దమౌతూ.
ఆవిరిపూలతో మేఘాలను నిర్మిస్తుంది
కృతజ్ఞతలను మౌనంగా తెలియజేస్తుంది
కమ్మని స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటుంది.

స్నేహమంటే పువ్వుదీ...పరిమళానిదే.
మొక్కనుంచి వేరైనా
నిర్దాక్షిణ్యంగా తుంచేసినా
కడదాకా కలిసే ఉంటాయి
వేరుచేయడం అసంభవం.
విడివిడిగా చూడానుకోవడం అసాధ్యం

స్నేహమంటే మనదే...
నీ కన్ను దుఃఖిస్తే నామనసు చమరిస్తుంది
నా మనసు శోకిస్తే నీ గుండె భారమౌతుంది.
ప్రేమలో ఉండే స్వార్ధాన్ని మన స్నేహం జయించింది.
స్నేహంలోని మాధుర్యాన్ని జగతికి చాటి చెప్పింది. ...@శ్రీ
03/08/2014

21/07/2014

|| కవిత్వమంటే ||






|| కవిత్వమంటే || 

పట్టెడు అక్షరాల్లో 
పుట్టెడు భావాలు గుప్పించడమే.

అక్షరాలకి
అందమైన భావాల రంగులు పూయడమే.

అక్షర(య)గనుల్లో
భావాల మణులను వెలికితీయడమే.

అక్షరఖడ్గాలతో
భావప్రహారాలు చేయడమే.

అక్షరాణువులతో
భావవిస్ఫోటనం చేయడమే.

అక్షరలక్షలతో
భావాలను అమూల్యం చేయడమే.

అక్షరసుమాలతో
భవ్యమైన భావమాలికలు అల్లడమే.

అక్షరవిత్తులతో
భావాలసేద్యం చేయడమే.

అక్షరకపోతాలకు
భావవ్యక్తీకరణలో స్వేచ్చను నేర్పించడమే.

అక్షరాలతో అలవోకగా ఆడుకోవడమే
పదాలతో పదనిసలు పలికించడమే
అక్షరాల ఇటుకలతో భవ్యమైన భావసౌధాలు నిర్మించడమే...@శ్రీ

|| నా వసంత కౌముది ||









ఏ నీలిసాగరాల తరంగాలు నేర్పాయో
నీ కురులకి ...నా ఊపిరుల వాయులీనాలకి నాట్యమాడమని

ఏ విలుకాడు నేర్పాడో శరప్రయోగాలు 
నీ కన్నులకి ...గురితప్పకుండా నా మదిని భేదించమని

ఎ నదులు నడుం బిగించాయో
నీ నడుముకి కొత్త ఒంపులు నేర్పేందుకు

మావి చివుళ్ళు మెక్కిన ఏ కోయిల నేర్పిందో గానాలు
నీ గళానికి...మత్తెక్కించే గానంతో నన్ను వశపరుచుకోమని

ఏ దివ్యసుమాల మకరందం గ్రోలాయో
జుంటితేనెల మాధుర్యాన్ని మాటలలో కలిపే నీ అధరాలు

ఎ లతల వద్ద నేర్చాయో నీ బాహువులు
ఇంత చక్కని అల్లికలు...నను వదలని పెనవేతలు

ఎన్ని పున్నములు కలగంటున్నాయో
నీ వన్నెల నృత్యానికి యవనికగా మారాలని

ఎన్నెన్ని వసంత కౌముదులు పోటీ పడుతున్నాయో
నాలో నీవు కుమ్మరించిన వసంతాలకి నీడగానైనా ఉండాలని

నా కనులు ఎన్ని కలలలో స్వప్నాలు చూస్తున్నాయో
నీతో కలిసే ప్రతి స్వప్నం...కలలో కూడా కల్లలు కాకూడదని...@శ్రీ