21/07/2014

|| నా వసంత కౌముది ||









ఏ నీలిసాగరాల తరంగాలు నేర్పాయో
నీ కురులకి ...నా ఊపిరుల వాయులీనాలకి నాట్యమాడమని

ఏ విలుకాడు నేర్పాడో శరప్రయోగాలు 
నీ కన్నులకి ...గురితప్పకుండా నా మదిని భేదించమని

ఎ నదులు నడుం బిగించాయో
నీ నడుముకి కొత్త ఒంపులు నేర్పేందుకు

మావి చివుళ్ళు మెక్కిన ఏ కోయిల నేర్పిందో గానాలు
నీ గళానికి...మత్తెక్కించే గానంతో నన్ను వశపరుచుకోమని

ఏ దివ్యసుమాల మకరందం గ్రోలాయో
జుంటితేనెల మాధుర్యాన్ని మాటలలో కలిపే నీ అధరాలు

ఎ లతల వద్ద నేర్చాయో నీ బాహువులు
ఇంత చక్కని అల్లికలు...నను వదలని పెనవేతలు

ఎన్ని పున్నములు కలగంటున్నాయో
నీ వన్నెల నృత్యానికి యవనికగా మారాలని

ఎన్నెన్ని వసంత కౌముదులు పోటీ పడుతున్నాయో
నాలో నీవు కుమ్మరించిన వసంతాలకి నీడగానైనా ఉండాలని

నా కనులు ఎన్ని కలలలో స్వప్నాలు చూస్తున్నాయో
నీతో కలిసే ప్రతి స్వప్నం...కలలో కూడా కల్లలు కాకూడదని...@శ్రీ 

1 comment:

  1. మనసు మెచ్చిన మగువ ప్రతీ కదలికా...ప్రతీ స్పర్శా అపురూపమే కదా వలచిన మదికి.

    'నా కనులు ఎన్ని కలలలో స్వప్నాలు చూస్తున్నాయో
    నీతో నీతో కలిసే ప్రతి స్వప్నం ....కలలో కూడా కల్లలు కాకూడదని'

    ఇంతకన్నా ఇంకే విధంగానూ చెప్పలేరు ఎవరూ తమ ఇష్టాన్ని. ఇది మీ భావ ప్రకటనకు పరాకాష్ఠ.

    ReplyDelete