04/04/2012

చిత్రమే కదూ!


నీ ప్రేమతో ఉండమంటావ్..
నా ప్రేమే నువ్వంటాను....

నీతో ఉండమంటావ్...
నాలోనే నువ్వున్నావంటాను....

నీ మనసులో ఉండమంటావ్....
నా మనసే నువ్వంటాను....

నీ ప్రాణంలా చూసుకుంటానంటావ్...
నా ప్రాణమే నువ్వంటాను....

నీ నవ్వుల్లో నన్నుండమంటావ్...
నా నవ్వుకి కారణం నువ్వంటాను...
నీ కోసం జీవించమంటావ్...
నా జీవితమే నువ్వంటాను....

నీలో సగం నేనంటావ్...
నాలో 'నాకు' చోటు లేదంటాను....
ఇన్ని భిన్నాభిప్రాయాలున్న
మనం కలిసి ఉండటం చిత్రమే కదూ!!!!!!!














అమరత్వం

అంధకార  బంధురమైన  రాత్రి  నేనైతే....
దివ్య దీప్తులు విరజిమ్మే కౌముది నీవు.

జ్వలిత  తప్త మరుస్థలం నేనైతే....
నవ వసంత  నందనం  నీవు.

నా నిర్జీవ జీవితాన్ని 
జీవంతం చేయడానికొచ్చిన..
సంజీవిని  నీవు.



కన్నులు మూసికూడా 
ఉజ్జ్వలమైన  నీ సౌందర్యాన్ని 
నా మనో నేత్రాల ముందు సాక్షాత్కరించుకుంటున్నాను. 

అమృతం తాగిన వాళ్ళందరూ అమరులౌతారని విన్నాను.
నీ ప్రణయ మకరందంతో నా మనసుని ఎప్పుడో తడిపి వేసావు..
మరి నీ అధరామృతాన్ని కూడా కాస్త రుచి చూపి...
నాకు  'అమరత్వాన్ని'  ప్రసాదించవూ?

                                                                                               @శ్రీ 







03/04/2012

తలపు- తలపుకీ మధ్య



నీ తలపులతో  
మొదలవుతుంది 
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో  చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.

నన్నెందుకు 
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....

నానుంచి నీ తలపులను 
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో.... 
నా మనసులోకి తొంగి చూస్తావు.

నిన్ను మర్చిపోవాలనుకొనే 
సమయంలో  
మరీ ఎక్కువ   గుర్తొస్తావ్  సుమా!

దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం  సహజమే...
కాని తలపు- తలపుకీ  మధ్య కూడా 
తలపుల్లోకి  వచ్చేస్తే  ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి 
దూరంగా ఉండడం  ఎలా???

02/04/2012

ప్రేమలేఖలు రాయటం మళ్ళీ మొదలెట్టవూ?

ప్రియా!
నీ ప్రేమలేఖ లోని అక్షరాలు
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు,
నిశ్చలమైన నా మనోకాసారంలో 
వికసించిన  ప్రేమారవిందాలు.

పత్రంలోని భావాలు హరివిల్లు లోని సప్త వర్ణాలైతే,
అ రంగుల దారాలతో కలనేసిన చీరకట్టులో 
నీవున్నట్లే అనిపిస్తుంది ...నా కళ్ళెదుట.

పదాల వెంట పరుగులు తీసే కళ్ళకంటే,
నా మనసే వేగంగా చదువుతుంది...
నీ మనసులోని ప్రతి తలపును.

నీ లేఖలు....
మనసును కమ్ముకున్న చీకటి మేఘాలను 
చెల్లాచెదురు చేసే వెన్నెల కిరణాలు....
వలపు తాపాలను చల్లార్చే మంచు తుఫానులు....
మదిలోనికి  చొచ్చుకోనిపోయే  మదనుని  శర పరంపరలు....

అందుకే అడుగుతున్నాను..
నా మనసు మెచ్చే...
నీ మనసుకి నచ్చే...  
ప్రేమలేఖలు  రాయడం మళ్ళీ మొదలెట్టవూ?  

                                                                        @శ్రీ






01/04/2012

శ్రీ సీతారామ కళ్యాణం


సభంతా కిక్కిరిసి ఉంది.
రాజాధిరాజులు, చక్రవర్తులు, సామంతులు
తమతమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి
శివుని విల్లు ఎక్కుబెట్టి 
'సీత'ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.


ఒక్కక్కరే  ప్రయత్నించి  అవమానభారంతో
వెనుదిరుగుతున్నారు.
జనకుని మనసులో ఆందోళన.
మిథిలాధీశుని పట్టపురాణి ముఖములో 
నిరాశ,నిస్పృహలు అలుముకున్నాయి ....

మైథిలి క్రీగంట శ్రీ రాముని చూసింది.
పురుషులకి సైతం మోహనంగా కనిపించే 
ఆ రూపాన్ని మనసులో చిత్రించుకుంది.
రాముని చూపు సీతపై పడింది...
చూపులు కలిసాయి...
రాముని తనువు విద్యుద్ధనువైతే
సీత మేను సిగ్గుల హరివిల్లే అయింది.

విశ్వామిత్రుని ఆజ్ఞ అయింది
శివధనస్సుని సమీపించాడు రాముడు.
క్షణం  క్రితం చూసిన సీత బరువైన  పూలజడ మదిలో మెదిలింది.
ఈ విల్లునే  ఎ త్తలేకుంటే రేపు ఆ జడనెలా ఎత్తగలను? అనుకున్నాడు.

అలవోకగా శివధనువునెక్కుబెట్టాడు
ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది 
ఫెళ్ళున పిడుగుపాటు ధ్వనితో విల్లు విరిగింది.
సీత పెదవిపై చిరునవ్వు విరిసింది

మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి
సీతమ్మ పెల్లికూతురయ్యింది.
సీతారాములు కళ్యాణమాలలు మార్చుకున్నారు,
ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు.
దేవపారిజాతాల   పుష్పవృష్టిలో  సీతారాములు పరిమళభరితులయ్యారు

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం,
అది లోక కళ్యాణం, జగత్కళ్యాణం,
ఈ విశ్వానికే  నిత్యకళ్యాణం-పచ్చతోరణం.


                                                                                         @శ్రీ 

(అందరికీ ' శ్రీరామనవమి'  శుభాకాంక్షలతో...)

























31/03/2012

ఓటమిలో గెలుపు


నా మనసుని మెత్తగా కోసే శక్తి....
ఏ చంద్రహాసానికీ లేదనుకొనే నన్ను
నీ మందహాసంతో  పరిహసించావు....

నా  ప్రేమ ఒక నిరంతర  ప్రవాహమైతే,
నీ వలపుల  సంద్రంలో  దాన్నెప్పుడో  కలిపేసుకున్నావు....
నా మాటల తీయదనం కంటే,
నీ పలుకుల తేనెలే మధురం అని తెలిసేలా చేసావు....

నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాననే భ్రమలో ఉన్న నన్ను ...
నీ ప్రేమతో జయించి....వాస్తవంలోనికి తీసుకొచ్చావు.

అన్నింటా గెలుపు నీదేనా?
నన్ను ఒక్కసారైనా గెలవనివ్వవా?
అని అడిగితే నాకు గెలిచే అవకాశం మాత్రం ఇవ్వకుసుమా!

నీ గెలుపు నాకు ఇచ్చే హాయి కంటే
నా గెలుపు యిచ్చే సుఖం గొప్పది కాదని,
ముందే ఒప్పేసుకుంటున్నాను.
నా ఓటమిలోనే నా  ప్రేమగెలుపుని
ఆనందంగా  స్వీకరిస్తున్నాను......


























29/03/2012

తొలి ప్రేమ


నీ తొలి చూపుల బాణాలు  
ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి......

నీవు మాట్లాడిన మొదటి మాట
నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది...

నాపై  విసిరిన నవ్వుపువ్వు 
తగిలి కందిన బుగ్గ ఇంకా ఎర్రగానే ఉంది....

నీ తొలిప్రేమలేఖ లోని అక్షర నక్షత్రాల మెరుపులు....
నేటికీ నాకంటికి అలంకారాలుగానే ఉన్నాయి.

నీవు తొలిసారి వ్యక్తం చేసిన ప్రేమ....
ఎప్పటికీ మరువలేని మధుర స్వప్నం లాగే ఉంది.

మనం తొలిసారి తిరిగిన తోట గులాబీల పరిమళం...
ఇప్పటికీ నన్ను పలకరిస్తూనే ఉంది.

నన్ను తాకిన నీ తొలిస్పర్శ....
నేటికీ ఒక అగ్నికీలలా నన్ను దహిస్తూనే,
శ్రీచందనపు పూతలా హాయినిస్తోంది.

నీ చూపులు, నీ నవ్వులు,
నీ మాటలు, నీ లేఖలు,
నీ వలపులు, నీ తలపులు....
అన్నీ నాలోనే ఉంటూ అనుక్షణం 
నిన్నే గుర్తుకి తెస్తుంటే,
ఈ విరహం కూడా సుఖంగానే ఉంది....
నీ ప్రేమలా.
                                                                              @ శ్రీ