21/07/2014

|| సుకుమారివి నీవే ||












విరబూసిన సౌందర్యం 
విరిసిన నీ ముఖారవిందం
భ్రమరాలకి ఆకర్షణం
అందాలకి నందనం...



సిరి మల్లెల మెరుపును ధిక్కరిస్తోంది
నెలవంకను తలపించే చిరునవ్వు
కంటివెలుగును అడుగుతాయి తారకలు
ఒక్క రేయికైనా ఆ తళుకులను తమకీయమని.



కన్నె ప్రాయపు అందాలు
మనసు దోచే సౌందర్యాలు
సౌందర్యాల నిధివి నీవు
నిశి ఎరుగని రాకాశశి నీవు
వెన్నెల పంచే వన్నెల విసనకర్రవి
నిండు అమాసకి సైతం పున్నమినిచ్చే ముగ్ధవి.



నీలిసంద్రం తరగలకి ఉరుకులు నేర్పుతూ
నీ నుదుటిని ముద్దాడే ముంగురులు.



వెన్నెలకే వన్నెలను అందించే
కాంతుల దొన్నెలు నీ కన్నులు
దేవశంఖం లాంటి నీ మెడకు అలంకారంగా
నీ నవ్వులమాలికనే నీకర్పించాను ముత్యాలసరంగా.



అందాలకు పాఠాలు నేర్పిస్తావు
అందంగా ఎలా ముస్తాబవాలో
సెలయేటికి గలగలలు నేర్పిస్తావు
నీ మాటల పరవళ్ళతో



సౌందర్యాల నిధివి నీవే
నిశి ఎరుగని రాకాశశి నీవే
సౌకుమార్యానికి కోమలత్వం నేర్పే సుకుమారివి నీవే

1 comment:

  1. అక్షరాలకు సౌందర్యాన్నీ సౌకుమార్యాన్నీ, నేర్పే మీ భావాల ముందు ఇక ఎంతటి సౌందర్యమైనా దిగదుడుపే అనిపిస్తోంది.
    'నిశి ఎరుగని రాకాశశి నీవు ' :)

    ReplyDelete